ఎల్వీ ప్రసాద్ డైరెక్ట్ చేసిన 'మనదేశం' చిత్రంతో ఎన్టీ రామారావు నటునిగా పరిచయమయ్యారు. ఆ మూవీలో చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్ర ధరించగా, కృష్ణవేణి నాయికగా, చదలవాడ నారాయణరావు కథానాయకునిగా నటించారు. మీర్జాపురం రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటికే రాజావారితో కృష్ణవేణికి వివాహం జరిగింది. ఆయనకు ఆమె రెండో భార్య. రాజా మొదటి భార్య పేరు భూదేవి. ఆమె సంసారంపై ఆసక్తి కోల్పోవడంతో కృష్ణవేణిని ఇష్టపడ్డారు రాజావారు. ఆమెతో పెళ్లి ప్రతిపాదన తెచ్చారు. ఆమె బాబాయ్‌తో మాట్లాడారు.
కానీ, వారి పెళ్లికి అభ్యంతరాలు వచ్చాయి. అందుకే రహస్యంగా విజయవాడలోని సత్యనారాయణపురంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అందరూ బాగానే కలిసిపోయారు. భూదేవికి నలుగురు పిల్లలు. కృష్ణవేణి ఆరోగ్య స్థితి రీత్యా ఒక్క కూతురితోనో సరిపెట్టుకున్నారు. ఆ కూతురు ఎవరో కాదు.. తర్వాత కాలంలో పలు సినిమాలు నిర్మించి ఎన్.ఆర్. అనూరాధాదేవి.
'జీవనజ్యోతి' అనే సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు రాజావారు, కృష్ణవేణి మధ్య ప్రేమ పుట్టింది. ఆ సినిమాకు రాజావారు నిర్మాత. అప్పుడు కృష్ణవేణి వయసు కేవలం 15 సంవత్సరాలు. ఆ సినిమాలో ఆమె హీరోయిన్. ఆమెకూ, రాజావారికీ మధ్య వయసులో చాలా తేడా ఉంటుంది. ఆమె కంటే ఆయన 20 సంవత్సరాలు పెద్ద. కానీ వారి మధ్య ప్రేమకు ఆ వయసు భేదం అడ్డు కాలేదు. 1940లలో తెలుగు చిత్రసీమలోని నాయికల్లో ఇప్పటికీ జీవించి ఉన్న ఏకైక తార.. సి. కృష్ణవేణి!